మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X వేదికగా హర్షం వ్యక్తం..

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోందన్నారు. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో 1996లో తాను శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి సోమవారం ప్రారంభించే అవకాశం రావడం ఎంతో భావోద్వేగానికి, సంతోషానికి గురిచేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. వెలిగొండ అనేది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా అని, ఫ్లోరైడ్‌ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రతని తెలిపారు. వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తును, పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గాన్ని చూపిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా వెలువడే కృష్ణమ్మ జలాలు ప్రకాశం జిల్లాకే కాకుండా పరిసర ప్రాంతాలకు సైతం నిజమైన వరప్రదాయినిగా మారనున్నాయి. ఎండిపోయిన సాగు భూములకు కొత్త ఆశలు చిగురింపజేస్తూ, తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా సమసిపోయేలా చేయనున్నాయి. రైతుల 3 దశాబ్దాల కల కళ్లముందు సాక్షాత్కరిస్తున్న వేళ, వెలిగొండ జలసిరులు ఈ కరవు ప్రాంత భవిష్యత్తుకు, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు వేస్తున్నాయి.

కొల్లం వాగు వద్ద ప్రాజెక్టు గేట్లను ఎత్తి కృష్ణా జలాలను సొరంగ మార్గంలోకి అధికారులు విడుదల చేసి ట్రయల్ రన్ చేశారు. నీటి ప్రవాహం, గేట్ల పనితీరును పరిశీలిస్తూ గంటవానిపల్లి క్రాస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. సొరంగం గుండా వెళ్తున్న ఈ జలాలు క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకోనుండగా, తదుపరి నీటి తరలింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.