కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కేసులో కీలక పరిణామం…

ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌కు సంబంధించిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలను పోలీసులు తదుపరి విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణపై దాడి ఘటనకు సంబంధించి సుమంత్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరికృష్ణ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం సహా పలు అభియోగాలతో దర్యాప్తు కొనసాగుతోంది.
కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ ఓఎస్‌డీ సుమంత్‌తో వారికి ఉన్న సంబంధాలు, దాడికి ముందు జరిగిన పరిణామాలు, దాడిలో వారి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో కస్టడీ విచారణ ద్వారా మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.