భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు.?

ఇండియా ఔట్‌’ అంటూ భారత్‌ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు..భారత్‌ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్‌కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్‌ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్‌కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.

మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్‌ పోర్ట్స్‌ లిమిటెడ్‌.. థిలాఫుషి పోర్ట్‌ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్‌ ఇంజినీరింగ్‌ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్‌కు అసలు ట్విస్ట్‌ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్‌ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్‌ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్‌వేలను భారత్‌ నిర్మిస్తోంది. 400 మిలియన్‌ డాలర్ల రుణం, మరో 100 మిలియన్‌ డాలర్ల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టుకు భారత్‌ మద్దతు ఇస్తోంది..అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్‌ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.

భారత్‌కు నమ్మకద్రోహం..
ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్‌’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్‌ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్‌వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్‌.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్‌ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది…అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్‌ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్‌కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్‌ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్‌ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్‌కు నష్టం ఎక్కడ?
మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్‌ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్‌ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్‌ను మరింత సులభం చేయవచ్చు.

రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్‌గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్‌కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్‌కు సున్నితమైన అంశం.

మూడోది.. భారత్‌ ప్రభావానికి సవాలు. 2024లో భారత్‌, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్‌తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.