‘నేనే కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా..!’
సౌజన్యను పెళ్లి చేసుకుంటే రూ.25 కోట్ల ఆస్తి నాదే అనుకున్నా.
పోలీసుల విచారణలో సాధిక్‌ఖాన్ వెల్లడి?.
కాకినాడలోని ప్రో షూటింగ్ అకాడమీకి విచారణ కోసం సాధిక్‌ను తీసుకువెళ్లిన పోలీసులు.
కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని చంపడానికి ప్రయత్నించింది తానేనని నిందితుడు సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. రిమాండ్‌లో ఉన్న సాధిక్‌ను కోర్టు అనుమతితో మూడు రోజులుగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు విచారిస్తున్నారు. తొలి రెండురోజులు తనకేమీ తెలియదని బుకాయించిన సాధిక్.. పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపడంతోపాటు సైనైడ్ విక్రయించినవారి సాక్ష్యం గురించి చెప్పడంతో అంగీకరించక తప్పలేదు.
అవును.. జగదీశ్వరరెడ్డిని చంపాలనుకున్నా. విషపదార్థాన్ని ఓసారి కొబ్బరి నీళ్లలో కలిపి ఇచ్చాను. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పుడే మూడు నాలుగు సార్లు ఇచ్చాం. వాటితో ఆరోగ్యం పాడై చనిపోతాడనుకున్నాం. హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి కొంత కోలుకుని బయటకు వచ్చాక సైనైడ్ పంపించాను. అది ఉపయోగించడంతో మర్నాడు చనిపోయాడు’ అని చెప్పినట్లు సమాచారం.
.
జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యను పెళ్లి చేసుకుంటే వారి ఆస్తి రూ.25 కోట్ల వరకు వస్తుందనుకున్నాను. కానీ ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆస్తిని మనవడితో పాటు కుటుంబంలో వేరొకరి పేరున రాస్తామన్నారు. ఆస్తి కోసమే ఇంతా చేస్తే మీరు ఇలా చేయడాన్ని అంగీకరించనని గొడవ పడ్డాను. చంపేస్తానన్నాను. అంతేగానీ వారు ఆత్మహత్య చేసుకుంటారని ఊహించలేదు’ అని సాధిక్ పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలిసింది. సాధిక్ ఉపయోగించిన విష పదార్థం నమూనాలను సీజ్ చేశారు.
పోలీసులు ఇంకా పూర్తి దర్యాప్తు చేసే పనిలో పడ్డారు..