తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌పై చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది..ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు సంబంధించి 700 ఎకరాల భూమిపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని, తక్షణమే నోటీసులు ఇచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించడం పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న భూమిని పేద ఎస్సీలకు పంచుతామని స్పష్టం చేయడం, కేటీఆర్, హరీశ్ రావు, కవిత కుటుంబాల పేరిట ఉన్న వందలాది ఎకరాల ఆస్తుల వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న భూముల వివరాలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. తొమ్మిది జిల్లాల పరిధిలోని 24 మండలాల్లో కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 439 ఎకరాల భూమి ఉందని ఆయన పేర్కొన్నారు.
జోగినపల్లి సంతోష్ కుమార్ కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్ రావుకు 52 ఎకరాలు, కొండల్ రావుకు 48 ఎకరాల భూమి ఉందని వెల్లడించారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్‌పై తాను బాంబులు ఎందుకు వేస్తానని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నేనేమైనా బిన్ లాడెన్‌నా అని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు..
ఈ అనూహ్య నిర్ణయం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల భవిష్యత్తుపై రాబోయే రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది..