నాలుగు ముక్కలు కానున్న గ్రేట్ బ్రిటన్..!!

యునైటెడ్ కింగ్ డమ్ ప్రపంచంలో ఇపుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ దేశాల అగ్రనేతలు భేటీ అయి సంయుక్తంగా స్వయం నిర్ణయాధికార డిమాండ్లను లేవనెత్తడం యూకే (యునైటెడ్ కింగ్‌డమ్)భవిష్యత్తును మరింత సందిగ్ధంలోకి నెట్టింది..ఐర్లాండ్ పునరేకీకరణను బలంగా కాంక్షించే సిన్ ఫెయిన్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఫస్ట్ మినిస్టర్ మైఖేల్ ఓ’నీల్ విలీన ప్రక్రియ కోసం ఒత్తిడి తెస్తున్నారు.

స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కీలక భూమిక..
యునైటెడ్ కింగ్‌డమ్ విభజన దిశగా సాగుతున్న పరిణామాలలో స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2026 సెప్టెంబరులో స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ దేశాల ప్రాంతీయ ప్రధాన మంత్రులు కార్డిఫ్ నగరంలో భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదే సమావేశంలో యూకే నుండి విడిపోయేందుకు, స్వయం నిర్ణయాధికార హక్కు కోసం ఒక చారిత్రాత్మక ఒప్పందం పై సంతకాలు చేయడం రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఉత్తర ఐర్లాండ్ విలీన అంశంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఐరిష్ ప్రధాన మంత్రి మైఖేల్ మార్టిన్ ఈ బోర్డర్ పోల్ ఎప్పుడు నిర్వహించాలనే నిబంధనలపై స్పష్టత కావాలని బ్రిటన్‌ను కోరారు. బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ మాత్రం ప్రస్తుతానికి బోర్డర్ పోల్ నిర్వహించే ఆలోచన లేదని స్పష్టంచేశారు.

ఐర్లాండ్ పునరేకీకరణ..
ఐర్లాండ్ పునరేకీకరణ ఆకాంక్షఉత్తర ఐర్లాండ్ సమస్య స్కాట్లాండ్ కంటే భిన్నమైనది. ఇది యూకే నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా మారడం కంటే, పక్కనే ఉన్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ దేశంతో కలిసిపోవాలని కోరుకుంటోంది. 1998లో జరిగిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రకారం, ఉత్తర ఐర్లాండ్ ప్రజలు యూకే నుండి విడిపోవాలని అనుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే.. అక్కడ బోర్డర్ పోల్‌తో సరిహద్దు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే చట్టపరమైన హక్కు ఉంది.

చారిత్రక ఘర్షణలు, భౌగోళిక అంశాలు, రాజకీయ వికేంద్రీకరణ యునైటెడ్ కింగ్ డమ్ ను ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. వందేళ్ల క్రితం యునైటెడ్ కింగ్‌డమ్ చరిత్రలో మొదటి పెద్ద విభజన ఐర్లాండ్ రూపంలో జరిగింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఐరిష్ జాతీయవాదులు తిరుగుబాటు చేశారు. 1920లో గవర్నమెంట్ ఆఫ్ ఐర్లాండ్ యాక్ట్ ద్వారా ఐర్లాండ్ దీవి రెండుగా విడిపోయింది. దీనివల్ల కాథలిక్ మెజారిటీ ఉన్న దక్షిణ భాగం స్వతంత్ర దేశంగా మారింది. దీన్నే ఇపుడు ఐరిష్ ఫ్రీ స్టేట్ – రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ వ్యవహిస్తోంది. ప్రొటెస్టంట్ మెజారిటీ ఉన్న ఉత్తర ఐర్లాండ్ మాత్రం యునైటెడ్ కింగ్ డమ్ లోనే ఉండిపోయింది.