దానం సీటు ఖాళీ.. ఉప ఎన్నికలపై కారు-కమలం గురి..!.

దానం సీటు ఖాళీ.. ఉప ఎన్నికలపై కారు-కమలం గురి!.

ఖైరతాబాద్‌ నియోజవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌-బీజేపీలు అప్పుడే అక్కడ జరగబోయే ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. దానం నాగేందర్‌ అనర్హత వేటు పడిన తదుపరి నిమిషంలోనే ఇరు పార్టీల నేతలు ఆ నియోజకవర్గం గెలుపు పల్లవి అందుకున్నారు ఈ క్రమంలోనే గెలుపు తమదే అంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు

దానం నాగేందర్‌పై అనర్హత వేటు బీఆర్‌ఎస్‌ విజయమని, న్యాయ గెలిచిందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఒక పార్టీపై గెలిచి వేరే పార్టీ నుంచి పోటీ చేయడం నేరమని, మిగతా 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడటం ఖాయమన్నారు కౌశిక్‌రెడ్డి. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమన్నారాయన.

ఇక బీజేపీ కూడా హైకోర్టు తీర్పును స్వాగతించింది. దానం నాగేందర్‌ అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్‌కు చెంపపెట్టని బీజేపీ శాసనసభా పక్ష (బీజేఎల్పీ) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ఇకనైనా బుద్ధి మార్చుకోవాలన్నారు. పార్టీ మారాలంటే భయపడేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఏలేటి పేర్కొన్నారు. దానం నాగేందర్‌ అనర్హత అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం ఉండదన్నారు. ఇక ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఆయన వ్యాఖ్యానించారు.