దానం కి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫ్లెక్సీలు..
ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు
బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడని, మళ్లీ పోటీ చేస్తే ఓడిపోతాడని ఫ్లెక్సీలు.
“తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు దేశ రాజధాని న్యూఢిల్లీ కి చేరింది.
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రధాన గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం తీవ్ర రాజకీయ కలకలం రేపింది. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరుతో వెలసిన ఈ ఫ్లెక్సీలలో దానం నాగేందర్ రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ను పార్టీ కేడర్ ఎంతమాత్రం ఆమోదించడం లేదని ఆ ఫ్లెక్సీల ద్వారా బహిరంగంగా స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కదని సదరు ఫ్లెక్సీలలో ఘాటుగా హెచ్చరించారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు మళ్లీ టికెట్లు కేటాయిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకే ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఇలా రచ్చకెక్కడం గ్రేటర్ హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.”