తెలంగాణ యాసను కొందరు ఆకతాయిలు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తూ దెబ్బతీస్తున్నారు, దానికి తోడు మీడియా కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది…సీనియర్ నటుడు నరేష్..

ఇడుపు కాగితం సినిమా పై వివాదం పై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు… ఈ భాషా వివాదంపై ఘాటుగానే స్పందించాడు. ఈ సినిమా చుట్టూ రాజుకున్న యాస వివాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. సినిమా టైటిల్ లో ఉపయోగించిన మాతృభాష తెలుగులోని తెలంగాణ యాసను కొందరు ఆకతాయిలు కావాలనే తప్పుగా చిత్రీకరిస్తూ దెబ్బతీస్తున్నారని, దానికి తోడు మీడియా కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఆ మంటల్లో మరింత నెయ్యి పోస్తోందని నరేష్ తీవ్రస్థాయిలో మండిపాడు. మనకు మనమే మన భాషా వృక్షానికి ఉన్న కొమ్మలను నరుక్కోవడం అత్యంత మూర్ఖత్వం అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు..ఇడుపు కాగితం సినిమాకు వస్తున్న క్రేజ్ మరియు అటెన్షన్ చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ, అదే సమయంలో కొంతమంది ఆకతాయిలు మన మాతృభాష అయిన తెలుగులోని తెలంగాణ యాసను కావాలనే దెబ్బతీస్తున్న తీరు.. దానికి మీడియా కూడా మరింత ఆజ్యం పోస్తూ మంటలు రాజేస్తున్న విధానం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు కరుప్పు అంటే ఎంతమందికి అర్థం తెలుసు? కాంతార అంటే ఎంతమందికి తెలుసు? అయినా సరే మనం ఆ సినిమాలను హ్యాపీగా ఎంజాయ్ చేయలేదా? ఆ భాషల గురించి మనం ఎప్పుడైనా వివాదాలు సృష్టించామా? మనం రాజకీయంగా, భౌగోళికంగా విడిపోయి ఉండవచ్చు.. కానీ మనమంతా ఒకటే, మనది ఒకే రక్తం.. అదే తెలుగు రక్తం. దయచేసి మన అమ్మలాంటి మాతృభాషను అవమానించకండి. తెలుగులోని ప్రతి యాసకు ఒక గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక సమ్మేళనం ఉన్నాయి.

అంతకు ముందు ఆంధ్రా- తెలంగాణ భాషల మధ్య ఈ టైటిల్ పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని అర్ధం. అసలు ఇదేం టైటిల్.. ఎవరికి అర్ధమవుతోందని ఆంధ్రావారు ట్రోల్ చేయడంతో.. కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో యాస మీద రచ్చ జరుగుతోంది. తెలంగాణ వారు.. ఆంధ్రా యాసను.. ఆంధ్రావారు కొందరు.. తెలంగాణ యాసను ట్రోల్ చేస్తున్నారు….