సౌదీ అరేబియాలోని దమ్మం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు .. !

సౌదీ అరేబియాలోని దమ్మం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్ విమానాశ్రయంలో సోమవారం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం గాల్లో ఉండగా బాత్రామ్ లోని ఒక టిష్యూ పేపర్‌పై బాంబు అని రాసి ఉన్నట్లు క్యాబిన్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పైలట్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అహ్మదాబాద్‌కు విమానాన్ని మళ్లించాలని నిర్ణయించారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసి, విమానంలో ఉన్న 32 మంది ప్రయాణికులను టెర్మినల్ 2 వద్ద కిందకు దించారు.
అనంతరం అహ్మదాబాద్ పోలీసులు, భద్రతా దళాలు విమానంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) వి.ఎన్. యాదవ్ తెలిపారు. ప్రయాణికులకు టెర్మినల్ 2 వద్ద వసతి కల్పించినట్లు వివరించారు. విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్నదానిపై భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.