యువ పేసర్ ఆకాశ్ దీప్.. ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో అవకాశం అందుకున్న ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు..ఆకాశ్ దీప్ వేసిన మూడో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(0), ఓలీ పోప్(0) వరుసగా డకౌటయ్యారు. ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా డకెట్ పంచ్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మూడో స్లిప్ ఫీల్డర్ శుభ్‌మన్ గిల్ దిశగా దూసుకెళ్లగా అతను ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఆ మరుసటి బంతిని కూడా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లోనే వేయగా.. ఓలీ పోప్.. ఫ్లిక్ షాట్ ఆడాడు.
బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని సెకండ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది. అయితే బంతి అతని చేతులు తాకి మిస్సైంది. కానీ రెండో ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ పూర్తి చేశాడు. దాంతో ఇంగ్లండ్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసి అతను లేని లోటును తీర్చాడు. ఆ కాసేపటికే జాక్ క్రాలీ(19) సిరాజ్.. స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన జోరూట్, హ్యారీ బ్రూక్ ఆచితూచి ఆడుతున్నారు..