ఇంగ్లాండ్ గడ్డపై 200 రన్స్ చేసిన తొలి ఆసియా కెప్టెన్ గిల్..!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. 310/5తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అలరించాడు. 387 బంతుల్లో 269 పరుగులు చేశాడు. ఓవర్‌ నైట్ స్కోరు 41తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా 137 బంతుల్లో 89 పరుగులకే ఔట్ అయ్యాడు. సెంచరీ చేసే ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 103 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. గిల్, జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్, సుందర్ జోడీ ఏడో వికెట్‌కు 144 పరుగులు (189 బంతుల్లో) జోడించింది. తొలి రోజే యశస్వి జైస్వాల్ 87 పరుగులతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు..

అజారుద్దీన్, దిల్షాన్ రికార్డు బ్రేక్..

ఇంగ్లాండ్‌లో ఇంతకుముందు 1990లో మాంచెస్టర్ టెస్ట్‌లో నాటికెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ చేసినవే అత్యధిక పరుగులుగా ఉన్నాయి. అజారుద్దీన్ ఆనాడు 179 పరుగులు చేశాడు. ఆసియా దేశాల విషయానికి వస్తే, అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్గా శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ ఉన్నారు. 2011లో లార్డ్స్ మైదానంలో ఆయన 193 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రెండు రికార్డులను గిల్ బద్దులు కొట్టారు.

ద్రవిడ్, గవాస్కర్ తర్వాత మూడో బ్యాటర్ గిల్..

ఇక, భారత ఆటగాళ్ల విషయానికి వస్తే గిల్ కంటే ఇంగ్లాండ్‌లో ద్రవిడ్, గవాస్కర్ డబుల్ సెంచరీలు సాధించారు. సునీల్ గవాస్కర్ 1979లో 221 పరుగులు చేశాడు. 2002లో ఓవల్ మైదానంలో రాహుల్ ద్రవిడ్ 217 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడవ భారత బ్యాట్స్‌మన్‌గా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్‌లో సచిన్ చేసిన అత్యధిక స్కోరు 193 పరుగులు కావడం గమనార్హం. గిల్ కెప్టెన్ అయిన తర్వాత మూడో ఇన్నింగ్స్లోనే ఈ డబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్ అయిన తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో డబుల్ సెంచరీ చేసిన భారత రికార్డు సునీల్ గవాస్కర్ పేరు మీద ఉంది. కెప్టెన్ అయిన తర్వాత అతను కూడా మూడో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పుడు గిల్ లిటిల్ మాస్టర్ సరసన చేరాడు..