నిన్నటి నుంచి అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం..
సాంకేతిక సమస్యను అధిగమించేందుకు అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్.. 2026 ఏప్రిల్ 16ను మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా నోటిఫై చేసిన కేంద్రం.
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, శాసనసభలలో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023, గురువారం నుండి అమల్లోకి వచ్చింది. అయితే, 2029లో అమలు చేసేందుకు అదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో, ఏప్రిల్ 16 నుంచే ఈ 2023 చట్టాన్ని అమల్లోకి వచ్చే తేదీగా నోటిఫై చేసిన కేంద్రం.
అయితే, ఈ నోటిఫికేషన్ పార్లమెంట్లో జరుగుతున్న వేడివేడి చర్చల మధ్య వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ స్థానాల సంఖ్యను 850కి పెంచేందుకు మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో మహిళా రిజర్వేషన్లను అనుసంధానించే నిబంధనలను సవరించేందుకు కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. పాత నిబంధన ప్రకారం తదుపరి జనగణన (సెన్సస్) తర్వాతే రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, కొత్త సవరణ ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది..ప్రస్తుతం పార్లమెంట్లో ఈ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతున్న ప్రతిపక్షాలు, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ కావడంతో దీనికి రెండు వంతుల మెజారిటీ అవసరం. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం 2023 నాటి చట్టాన్ని నోటిఫై చేయడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే భారత ప్రజాస్వామ్యంలో మహిళల పాత్ర గణనీయంగా పెరగనుంది.
amendment-act-33-womens-reservation-comes.