భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం…ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు..

భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘డెడ్‌ ఎకానమీ’ అంటూ ఆయన చేసిన విమర్శలపై ఆస్ట్రేలియా నుంచి స్పందన వ్యక్తమైంది (Australia counters Donald Trump)..దేశ వాణిజ్యమంత్రి డాన్‌ ఫారెల్‌ అమెరికా అధ్యక్షుడికి కౌంటర్ ఇచ్చారు. అలాగే తమ అదృష్టాన్ని భారత్‌తో పంచుకోవాలనుకుంటున్నామని అన్నారు.

స్వేచ్ఛ, న్యాయపరమైన వాణిజ్యాన్ని తాము విశ్వసిస్తున్నామని, అమెరికా (USA) విధిస్తోన్న టారిఫ్‌లను ఆస్ట్రేలియా (Australia) సమర్థించబోదని ఫారెల్ అన్నారు. ”భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం. భారత్‌ కూడా అభివృద్ధి చెందుతోన్న ప్రజాస్వామ్యం. ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాలనుకుంటున్నాం. కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. భారత్‌లో మాకు గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. మాకున్న మినరల్స్‌, క్రిటికల్ మినరల్స్‌, రేర్‌ ఎర్త్స్‌ కారణంగా మమ్మల్ని లక్కీ దేశంగా అభివర్ణిస్తుంటారు”…మా అదృష్టాన్ని భారత ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నాం. ఈ రెండు దేశాల మధ్య సరఫరా గొలుసుల్ని మెరుగుపర్చుకుంటాం” అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. రెండుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం గురించి మాట్లాడుతూ.. చర్చల నిమిత్తం తమ ప్రతినిధిని దిల్లీకి పంపామని చెప్పారు. ఈ ఒప్పందం కోసం భారత వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ (Piyush Goyal)తో మాట్లాడానని, ఈ వారంలో మరోసారి మాట్లాడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇటీవల భారత్‌-రష్యా బంధంపై ట్రంప్‌ స్పందిస్తూ.. ఇద్దరూ వారి మృత ఆర్థికవ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు 50 శాతం సుంకాలు (US Tariffs) విధించిన సంగతి తెలిసిందే. అవి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్‌ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది.