బంగ్లాదేశ్‌లో లాక్‌డౌన్..!..

బంగ్లాదేశ్‌లో విధ్వంసం జరుగుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, స్వదేశంలో అడుగుపెట్టకముందే అక్కడి తారిఖ్ రెహ్మాన్ బీఎన్పీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది..డిసెంబర్‌లో తాను బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు షేక్ హసీనా ప్రకటించింది. దీంతో ఆమె పార్టీ అవామీ లీగ్ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. మహ్మద్ యూనస్ తాత్కాలిక అధ్యక్షుడి ఉన్న సమయంలో అవామీ లీగ్‌ను నిషేధించాడు. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు బంగ్లాదేశ్‌లో విరుచుకుపడుతున్నారు…

నెలల క్రితం ఆ దేశంలో మొదలైన హింస ఇంకా చల్లారలేదు. ఆమెసొంతపార్టీ అవామీ లీగ్‌ కార్యకర్తలు గత వారమంతా నిరసనలూ, ర్యాలీలూ జరిపి, ముగింపుగా గురువారం నిర్వహించిన బంద్‌ గమనిస్తే ఆ దేశం ఇప్పట్లో కుదుటపడుతుందన్న విశ్వాసం కలగదు…పరస్పర హననమే పరమావధిగా పార్టీలు రెచ్చిపోతున్నాయి.

తాజాగా పారా మిలిటరీ బలగాల కాల్పుల్లో నలుగురు మరణించటం, అనేకులు గాయపడటం, ప్రభుత్వ ఆస్తులకు నిప్పెట్టడం వంటి పరిణామాలు దిగ్భ్రాంతి కలిగి స్తున్నాయి. ముందురోజే అధికార బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) కార్యకర్తల్ని హత్యచేశారు. ఇద్దరు ఎంపీల ఇళ్లు తగలపెట్టడంతోపాటు, దాదాపు రెండేళ్లు కొనసాగిన తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా పనిచేసిన మహ్మద్‌ యూనస్‌ పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. ఈ దుఃస్థితికి మహ్మద్‌ యూనస్‌తోపాటు ప్రస్తుత ప్రధాని తారిఖ్‌ రెహ్మాన్‌ కూడా బాధ్యులే.

హసీనా ఏలుబడిలో కక్షసాధింపు చర్యలు మితిమీరిన మాట వాస్తవం. ఎన్నికల్లో రిగ్గింగ్‌తో అధికారంలో కొనసాగింది కూడా నిజం. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదంటూ ఆమె ప్రభుత్వం వేసిన దండోరా… జనం అనుభవి స్తున్న కడగండ్లను రూపుమాపలేకపోయింది. దేశంలో ఉపాధి కరువై, ధరలు బరువై సామాన్యులు కుంగిపోతుంటే అందుకు తగిన పరిష్కారాల్ని వెదకడంలో హసీనా విఫల మయ్యారు అనే ఆరోపణలతో. దానికి నిరసనగానే 2024లో విద్యార్థి ఉద్యమం ఉధృతమై చివరకు ఆమె దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది..ఈ ఉద్యమంలోని ప్రజాస్వామిక ఆకాంక్షల్ని అర్థం చేసుకోకుండా, ‘ఈసారిమావంతు…’ అన్నట్టు తాత్కాలిక ప్రభుత్వం వ్యవహరించింది. ప్రస్తుత ప్రభుత్వమూ అదే మార్గంలో పోతున్నది. ఉద్యమం తొలినాళ్లలోనే మతోన్మాద శక్తులు చొరబడి తమ ప్రాబల్యం స్థాపించేందుకు ప్రయత్నించాయి. మళ్లీ మధ్యయుగాలనాటి పరిస్థితుల్ని తలపించేలా మైనారిటీ హిందూ వర్గాలపై దాడులు చేశాయి. హత్యలకూ, గృహదహ నాలకూ పాల్పడ్డాయి. బురఖా వేసుకోనందుకు ఎందరో మహిళల్ని నడిబజార్లలో నెత్తురోడేలా కొట్టారు. అదృష్టవశాత్తూ అలాంటి శక్తుల్ని జనం ఓడించారు. బీఎన్‌పీ అధికారంలోకొచ్చింది. కానీ మారిందేమీ లేదు.

స్వావలంబన సాధించి, దేశాన్ని ప్రగతిపథంలో పయనింపజేయాలని ప్రయత్నిస్తుంటే… అవామీ ఉగ్ర పోకడలకు పోతున్నదని తారిక్‌ రెహ్మాన్‌ అంటున్నారు. ఇలాంటి అతిశయోక్తులే హసీనా కొంపముంచాయి. అవామీ నిరసనలకు సమాంతరంగా దేశంలో దుస్తుల తయారీ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు వేతనాల పెంపుదల కోసం రోడ్డెక్కారు. చివరకు గురువారం ఢాకా హైవేను స్తంభింపజేశారు. ఈ ఉదంతం చాలు… రెహ్మాన్‌ పాలన ఎంత దివ్యంగా ఉన్నదో చెప్పడానికి. విదేశాల్లో ఉండి హింసను రెచ్చగొడుతున్నారంటూ పరోక్షంగా హసీనాను అని ప్రయోజనం లేదు. తన నిర్వాకాన్ని సమీక్షించుకోవాలి…కేవలం తొమ్మిది నెలల పాలన ఆధారంగా తారిఖ్‌ను అంచనా వేయటం అన్యాయమే కావొచ్చు. అధికారంతోపాటు వచ్చే దర్పాన్నీ, సదుపాయాలనూ ఆయన తిరస్కరించారు. తన బొమ్మ ప్రభుత్వాఫీసుల్లో ఉండరాదన్న నియమం పెట్టారు. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. అల్పాదాయ వర్గాల కుటుంబాల్ని ఆదుకునే ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చారు. రైతులకు పదివేల టాకాల వరకూ రుణమాఫీ ప్రకటించారు. ఇలాంటివే హసీనా సర్కారు కూడా చేసింది. తారిఖ్‌ వీటితోపాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు మొదలెడితే వేరుగా ఉండేది. కానీ కక్షసాధింపే ప్రభుత్వ కార్యక్రమంగా మారింది.

అంతకుముందే హసీనాకు మరణశిక్ష విధించగా, మరో కేసులో 21యేళ్ల జైలుశిక్ష, వాటితోపాటు అవామీ నేతలు, కార్యకర్తలపై దాడులు, అరెస్టులు రివాజ య్యాయి. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగిత, విద్యుత్‌ వెతలు, వ్యవస్థల్ని చక్కదిద్దక పోవటం, పెట్టుబడులకు అనువైన వాతావరణం లేకపోవటం ప్రజలకు నిరాశమిగిల్చింది. తొమ్మిది నెలల విలువైన సమయాన్ని వృథా చేసిన ప్రభుత్వంపై అసంతృప్తి పెరగటంలో వింతేముంది? వచ్చే నెలలో నిజంగా హసీనా అడుగుపెడితే సమస్యలు మరిన్ని చుట్టుముడతాయి. సారాంశంలో ఇదంతా తారిఖ్‌ స్వయంకృతం…

బంగ్లాలో లాక్‌డౌన్..

షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తారని ప్రకటించడంతో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అవామీ లీగ్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో నవంబర్ 19న బంగ్లాదేశ్‌లో చాలా ప్రాంతాలు మూతపడ్డాయి. బుధవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో హింస, బాంబు పేలుళ్లు, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింస వెనక అవామీ లీగ్ ఉందని బంగ్లా ప్రభుత్వం ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్‌లో హింసను అదుపు చేసేందుకు బీఎన్‌పీ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో సుమారు 3,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఢాకా, చిట్టగాంగ్, నారాయణ్‌గంజ్, గాజీపూర్, గోపాల్‌గంజ్, మయమన్సింగ్, ఫరీద్‌పూర్ జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కు చెందిన 96 ప్లాటూన్లను రంగంలోకి దించారు..