మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణం ముస్లిం కాబట్టే..కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..!

భారత్ న్యూజిలాండ్ టెస్ట్ లో ఫాస్ట్ బౌలర్ సిరాజ్ సెలెక్ట్ చేయక పోవడంతో కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌ను ఆడించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ మేనేజ్‌మెంట్‌పై నిప్పులు చెరిగారు..తాజాగా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి అతని మతమే కారణమని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇమ్రాన్ మసూద్.. సిరాజ్ గైర్హాజరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

మతం కాకుంటే ఇంకేం ఉంటుంది..

‘సిరాజ్‌ను తప్పించడానికి అతని పేరు సరిపోదా? బాగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ అతన్ని జట్టులోకి తీసుకోలేదంటే ఇంకేం కారణం ఉంటుంది? అతని మతమే కారణమై ఉండాలి. మెరుగైన ప్రదర్శన చేస్తున్నా సిరాజ్‌ను ఎందుకు తప్పించారు?’అని ఇమ్రాన్ మసూద్ ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది..

ఇమ్రాన్ పచ్చి మతవాది: బీజేపీ

ఈ వ్యాఖ్యలు అసంబద్దమైనవని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కొహ్లీ విమర్శించారు. క్రికెట్ సెలెక్షన్స్ జట్టు ప్రాధాన్యతల ఆధారంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘ఇమ్రాన్ మసూద్ అభిప్రాయాలను ఎవరు పట్టించుకుంటారు? అతని పచ్చి మతవాది. క్రికెట్ జట్టు ఎంపిక మతం ఆధారంగా జరగదు.

జట్టు ప్రాధాన్యతలు, వ్యూహాలు, అవసరాల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. మాజీ క్రికెటర్లు టీమ్ సెలెక్షన్‌ నిలదీసారంటే ఓ అర్థం. కానీ క్రికెట్‌కు ఏ మాత్రం సంబంధం లేని ఇమ్రాన్ మసూద్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ వ్యవహారానికి మతపరమైన రంగును పులుమడం అర్థరహితం.’అని నళిన్ కోహ్లీ పేర్కొన్నారు.