అమెరికాకు చెప్పినట్టు నడిచే బంగ్లాదేశ్ ప్రభుత్వం పై ముదురుతున్న అంతర్గత సంక్షోభం – వైదొలుగుతానంటున్న యూనస్ – ఇక ఆర్మీ గుప్పిట్లోకి ?..

షేక్ హసీనా .. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ కు వచ్చి తలదాచ్చుకున్న తర్వాత ఆ దేశ పగ్గాలు.. అమెరికా కనుసన్నల్లో మెలిగే మహ్మద్ యూనస్ కు దక్కాయి..ఇతను ప్రజల గురించి ఏం చేయకపోయినా.. అమెరికాకు చెప్పినట్టు నడిచే ఇతనికి నోబెల్ శాంతి బహుమతి కట్టబెట్టారు. మొత్తంగా అమెరికా కనుసన్నల్లో మెలిగే వాళ్లకే ఈ అవార్డు దక్కుతుందనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఈ కీలు బొమ్మ ప్రభుత్వాధినేత రాజీనామా చేయనున్నట్టు నేషనల్ సిటిజన్‌ పార్టీ చీఫ్‌ నహిద్‌ ఇస్లామ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంపై యూనస్‌తో మాట్లాడుతానని వెల్లడించారు. అలాగే.. దేశ భద్రత, భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అందరూ ఆయనకు సహకరిస్తారని తాను ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఐక్యతను ఏర్పరచుకుని ఆయనకు సహకరిస్తాయనే నమ్మకం ఉందన్నారు.

గత కొద్ది రోజులుగా యూనస్‌ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో వీరిద్దరు మిత్రులుగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది.

గతేడాది సైనిక కుటుంబాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం మొదలైంది. ఆగస్టులో భారీ విద్యార్థి నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం, జరిగిన చర్చల తర్వాత.. సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. తొలినాళ్లలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ ఈ మార్పును సమర్థించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్షపడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది.

యూనస్‌కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్, అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వకార్, హసన్‌ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా, యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు.

మరోవైపు.. యూనస్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న సైన్యం మయన్మార్‌ సరిహద్దుల్లో మానవతా కారిడార్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడింది. అది బ్లడీ కారిడార్‌ అంటూ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో యూనస్‌ సర్కారు వెనక్కి తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది. కారిడార్‌ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా మారడంతోపాటు అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ సంక్షోభం నేపథ్యంలో యూనస్ తన పదవికి రాజీనామా చేస్తారా.. సైన్యంతో రాజీ పడతారా అనేది చూడాలి.