ప్రధాని మోడీ తెలంగాణ ద్రోహి..పార్లమెంటు సాక్షిగా తెలంగాణ జాతిని అవమానించారు…భట్టి విక్రమార్క.

ప్రధాని మోడీ తెలంగాణ ద్రోహి..పార్లమెంటు సాక్షిగా తెలంగాణ జాతిని అవమానించారని ఆగ్రహం..8 ఏళ్లుగా విభజన చట్టానికి తూట్లు పొడిచిన మోడీ సర్కార్.మోడీ, కేసీఆర్ లవి వీధి నాటకాలు.తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు..సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం

కాంగ్రెస్ పార్టీ హడావిడిగా ఏపీ విభజన చేసిందని రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహిగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఏ.పి., తెలంగాణా రాష్ట్ర విభజన చట్టం -2014 లో పేర్కొన్న ఏఒక్క హామీని నెరవేర్చని ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల అభీష్టం మేరకు ఇచ్చిన కాంగ్రెస్ ను విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ముందే తెలిసినప్పటికీ, పార్లమెంట్లో యూపీఏ, ఎన్డీఏ పక్షాలను ఒప్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్దంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియమ్మకే దక్కుతుందన్నారు. ఆనాడు పార్లమెంట్లో లేని మోడీ ఇప్పుడు రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ విభజన జరగలేదని ఆనాడు బీజేపీ శాసనసభాపక్ష నేత సుష్మాస్వరాజ్ చెబితే బాగుండేదని అన్నారు. కానీ నాడు పార్లమెంటులో లేని మోడీ తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆనాడు దురదృష్టవశాత్తు మోడీ చట్టసభలో ఉండి ఉంటే ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఉండేది కాదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించిన ఏడు మండలాలను (రెండు లక్షల ఎకరాలను) ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చేసిన ప్రధాని మోడీ తెలంగాణకు ద్రోహం చేశాడని మండిపడ్డారు. అనేక చర్చల తర్వాతే ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిందని, రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటులో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకోకూడదని కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాజ్యసభలో అమరవీరుల ఆత్మబలిదానాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించి తెలంగాణ జాతిని మోడీ అవమానించారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను సమ భావంతో చూసేలా ప్రధాని ప్రసంగం ఉండాలన్నారు. కానీ మోదీ ఇంత దిగజారి మాట్లాడటం వెనుక విభజించు లబ్దిపొందే అన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం బయట పడిందని ఫైర్ అయ్యారు.
విభజన చట్టంలో పేర్కొన్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదం, గిరిజన యూనివర్సిటీ మంజూరు, బయ్యారం లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట రైల్వే వే కోచ్ ఫ్యాక్టరీ సమస్యలను పరిష్కరించని మోడీ సర్కార్ కాంగ్రెస్ పై అవాకులు చవాకులు పేల్ఛడం సిగ్గుచేటుగా ఉందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ .900 కోట్లు రావాల్సివుందని, నవోదయ,కేంద్రీయ పాఠశాలలు, ఐఐటి, ఐఐఎమ్ , ఐఐఎస్సి విశ్వ విద్యాలయాలు ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టాన్ని తుంగలో తొక్కి రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా లేకుండా బిజెపి ప్రభుత్వం కారణమైందని ధ్వజ మెత్తారు.
హరీష్ రావు వ్యాఖ్యల పై ఆగ్రహం
2004లో తెలంగాణ ఇవ్వకుండా 1200 మంది ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే హరీష్ రావు ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద కర్మ అని విమర్శించారు.
పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పార్లమెంటు సభ్యులు లేనప్పటికీ ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియమ్మ ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి, మెప్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్దంగా తెలంగాణ ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు విస్మరించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో తెలంగాణ విభజన బిల్లు పెట్టిన సమయంలో ఉద్యమ నేత అని గొప్పలు చెప్పుకునే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు పార్లమెంట్లో లేడని ఎద్దేవా చేశారు. బిల్లు ఆమోదం కోసం ప్రతి ఓటు విలువైన సమయంలో పార్లమెంటులో కేసీఆర్ పత్తాలేకుండా పోయిన సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిందని అన్నారు. ఇప్పుడు అబద్ధాలు చెప్పినంత మాత్రాన చరిత్రను చెరపలేరని టిఆర్ఎస్ నాయకులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడుతుందో అన్ని విషయాలు తెలిసి కూడా టిఆర్ఎస్ నాయకులు భావోద్వేగాన్ని రెచ్చగొట్టి 1200 మంది బహుజనులను ఆత్మహత్యల వైపు పురికొల్పారు అని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంది 600 మంది మాత్రమేనని ప్రకటించిన టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు హరీష్ రావు 1200మంది తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యాఖ్యానించడంతో కెసిఆర్ అబద్ధాల పాలన బయటపడిందని అన్నారు. ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ రాజకీయాలు వీధి నాటకాలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి తెలంగాణకు ద్రోహం చేసిన మోడీ సర్కార్ ను నిలదీయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు దున్నపోతు వలే నిద్ర పోయిందన్నారు. మిషన్ భగీరథ ప్రారంభానికి గజ్వేల్ కు ప్రధానిని పిలిపించుకున్న కెసిఆర్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని కోరకుండా……కొంచెం ప్రేమ ఇవ్వాలని కోరినాడని గుర్తు చేశారు. ఎనిమిదేళ్లుగా విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటిపై మోడీ సర్కార్ తో పోరాటం చేయకుండా ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ బిజెపితో తగువు లాడటం పెద్ద నాటకమని అన్నారు.