బీహార్‌లోని అశోక్‌ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు మృతి..

బీహార్‌లో ఘోర విషాదం.. శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.

బీహార్‌లోని లఖిసరాయ్‌లో సోమవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. అశోక్‌ధామ్‌ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శ్రావణ మాసంలోని మూడో సోమవారం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చిన సమయంలో ఉదయం 6:30–6:45 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది…

ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. అక్కడ ఒక విద్యుత్ స్తంభం కూలిపోవడంతో ప్రజలు విద్యుదాఘాతానికి గురయ్యారని, దీంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రతిదీ ధృవీకరించిన తర్వాతే ఖచ్చితమైన కారణం చెప్పగలం,” అని ఎస్‌డిపిఓ శివం కుమార్ ఏఎన్‌ఐకి తెలిపారు..ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ స్తంభం లేదా తీగ కిందపడటంతో భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో భారీగా ఉన్న జనసమూహంలో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం పూర్తిగా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు…గాయపడిన వారిని వెంటనే లఖిసరాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతుల సంఖ్యపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది. .

శ్రావణ మూడో సోమవారం కావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు భారీగా బారులు తీరారు. ఈ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ తీగ తెగిపడటం, భక్తుల రద్దీతో బారికేడింగ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగి తొక్కిసలాట జరిగింది. ఈ హఠాత్పరిణామంతో భక్తులు భయంతో పరుగులు తీయగా, చాలా మంది మహిళలు కిందపడి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.