భోగాపురం ఎయిర్పోర్టులో చారిత్రక ఘట్టం.. తొలి వాణిజ్య విమానం ల్యాండింగ్!.
ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి..హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ చరిత్రలో ఇదే తొలి వాణిజ్య విమాన ల్యాండింగ్ కావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
ఈ తొలి విమానం ఉదయం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లింది. అదే సమయంలో, ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇండిగో విమానం భోగాపురంలో ల్యాండ్ అయి, ఉదయం 8:00 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమైంది. ఈ ల్యాండింగ్లతో ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమై, ప్రాంతీయ విమాన అనుసంధానత మరింత బలపడింది.