తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్కు తెరపడినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం..ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్టు తెలిసింది…
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే.. అందరి సమ్మతితో ఎన్నిక జరిపే విధంగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా.. తెలంగాణ బిజెపి అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగనుంది..
నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది.
అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు…
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మూడు నాలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు ఆలస్యమైంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు పాటు పలు రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం కొత్త అధ్యక్షులను ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తైయిన తర్వాత సంస్థాగత ఎన్నికలు జరగునున్నాయి. ఆ తర్వాత బీజేపీ అధిష్ఠానం జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. .