సీఎం రేవంత్‌కు చేరికల మీద ఉన్న దృష్టి… రైతు సమస్యలపై లేదు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిన్న(ఆదివారం) తాను దేవరుప్పుల మండలం లక్ష్మి భాయి తండాకు వెళ్లానని.. అక్కడ ఉన్న రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఓ రైతు నాలుగు బోర్లు, మరో రైతు ఆరు బోర్లు వేసినా పడలేదని రైతులు ఆవేదనగా చెప్పారని అన్నారు.

రైతుల పరిస్థితి అలా ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉంటే దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం చిల్లర ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు.. వివిధ పార్టీల్లోని నేతలను తన పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న దృష్టి.. రైతు సమస్యల పరిష్కారం మీద లేదని చెప్పారు.

మరోవైపు రైతులు అప్పులు కట్టాలని బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. బకాయిలు కడతారా లేదా..? అని బ్యాకు అధికారులు రైతులను బెదిరిస్తున్నారని అన్నారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని విరుచుకుపడ్డారు. రైతులకు ఇచ్చినా నాలుగు హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఏ మొహం పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతారని నిలదీశారు. సీఎం రేవంత్ ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి బతిమాలి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రేపటి నుంచి బీఆర్ఎస్ నేతలు పంట పొలాలకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఏ గ్రామంలో ఎంత నష్టం జరిగిందో వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపించాలనీ కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చేరికల మీద దృష్టి పెడుతున్నాయన్నారు. రైతుల కన్నీళ్ల చారికలపై దృష్టి పెట్టాలని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల సహాయానికి ఎన్నికల కోడ్ అడ్డురాదని చెప్పారు. రూ. రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులు ఎవరూ బ్యాంక్ అప్పులు కట్టోద్దని సూచించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. రైతు రుణమాఫీ జరిగే వరకు పోరాడుతామన్నారు. రేవంత్ ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వడ్లకు రూ.500బోనస్ ఇచ్చేదాకా ప్రభుత్వం వెంట పడతామని వార్నింగ్ ఇచ్చారు.

ధరణిలో లోపాలు ఎందుకు సరిచేయలేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

రెవెన్యూ అధికారులు విచ్చల విడిగా రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణిలో లోపాలు ఉంటే ఇప్పటి వరకు ఎందుకు సరి చేయలేదని ప్రశ్నించారు. పట్టాలు కావాల్సిన రైతులకు పట్టా చేయకుండా రెవెన్యూ అధికారుల ద్వారా వేధిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఉసురు పోసుకోవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.

రేవంత్ ప్రభుత్వానికి రైతుల పట్ల పట్టింపు లేదు: దేశపతి శ్రీనివాస్

తెలంగాణ అనేది వాస్తవమని.. తెలంగాణ సెంటిమెంట్ కానే కాదని బీఆర్ఎస్ నేత దేశపతి శ్రీనివాస్ అన్నారు. సెంటిమెంట్ అనే వారిని మెంటల్ అంటారని.. రేవంత్ ప్రభుత్వానికి రైతుల పట్ల పట్టింపు లేదని దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు..