తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చినా…బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్ట్!.

మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుబాయ్‎లో ఉంటున్న షకీల్ గురువారం ( ఏప్రిల్ 10) తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్ పోర్టులో షకీల్‎ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పోలీసులు షకీల్‎కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

కాగా.. 2023, డిసెంబర్ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. రాహిల్ తప్పతాగి ఈ యాక్సిడెంట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు రాహిల్‎తో పాటు కారులో ఉన్న అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి కుమారుడు రాహిల్‎ను తప్పించేందుకు తప్పుడు సాక్ష్యాలు సమర్పించడంతో షకీల్‎ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు.

ఈ కేసు నమోదు కాగానే షకీల్, రాహిల్ దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి దుబాయ్‎లోనే ఉంటుండగా.. బుధవారం (ఏప్రిల్ 9) షకీల్ తల్లి మృతి చెందారు. దీంతో తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‎కు రాగా పోలీసులు ఎయిర్ పోర్టులో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు..