భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. పాత భవనంపై ఐదు అంతస్తులు నాసిరకంగా నిర్మాణం చేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
అధికారులు చెప్పినా వినకుండా నిర్మాణం : భద్రాచలానికి చెందిన ఎస్కే మౌలానా అలియాస్ శ్రీపతి పాత భవనంపై గడచిన రెండేళ్లుగా ఒక్కోక్కటిగా ఐదంతస్తులు నిర్మించాడు. శ్రీపతి సేవ ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి నిర్మాణాన్ని చేపడుతున్నాడు. ఐతే పనులు నాసిరకంగా జరుగుతున్నాయని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు ఆపమని చెప్పినప్పటికీ శ్రీపతి అలాగే పనులు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు భవనం ఒక్కసారిగా కూలింది..నిర్మాణ పనులు చేస్తున్న కొందరు మృతి చెందారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. భవన శిథిలాల కింద ఒక వ్యక్తి బతికి ఉన్నట్లు సహాయక సిబ్బంది గుర్తించారు. భవన శిథిలాల కింద మేస్త్రీ కామేశ్వరరావు ఉన్నట్లు గుర్తించారు. భవనం పక్కన ఖాళీ స్థలం నుంచి 20 అడుగుల లోతు మేర తవ్వుతున్నారు. మేస్త్రీ కామేశ్వరరావుతో మాట్లాడగలిగారు. కామేశ్వరరావుకు నీళ్లు, ఆక్సిజన్ అందించారు. మేస్త్రీని బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరో మేస్త్రీ ఉపేంద్ర శిథిలాల్లో ఉన్నట్లు ఆయన భార్య తెలిపారు.
Building collapse: …
ఘటనాస్థలికి వైద్య బృందాన్ని రప్పించారు. శిథిలాల కింద సెల్ఫోన్, లంచ్ బాక్సు గుర్తించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఐటీసీ నుంచి ప్రత్యేకంగా ప్రొక్లెయిన్లు తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..