కెనడాలో అక్రమ నివాసాలపై ఉక్కుపాదం.. ఆరు నెలల్లోనే 3,323 మంది భారతీయుల డిపోర్ట్..

కెనడా ప్రభుత్వం దేశంలో అక్రమ నివాసాలు, వీసా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది (2026) తొలి ఆరు నెలల్లోనే 3,323 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి పంపించినట్లు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (CBSA) వెల్లడించింది.
గత ఏడాది (2025) మొత్తం 3,779 మంది భారతీయులను డిపోర్ట్ చేయగా, ఈ ఏడాది కేవలం ఆరు నెలల్లోనే 3,323 మందిని వెనక్కి పంపడం గమనార్హం. దీంతో అక్రమ వలసలు, వీసా నిబంధనల ఉల్లంఘనలపై కెనడా ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
2021లో కేవలం 603 మంది భారతీయులను వెనక్కి పంపగా, ఆ సంఖ్య 2022 నాటికి 786కి, 2023లో 1,132కి పెరిగింది. ఆ తర్వాత 2024లో ఏకంగా 2,004 మందిని కెనడా అధికారులు స్వదేశానికి పంపించారు. వీసాల గడువు ముగిసినా ఉండటం, నకిలీ పత్రాలతో ప్రవేశించడం, విద్యార్థి, వర్క్ పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలే ఈ భారీ డిపోర్టేషన్లకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ఈ సందర్భంగా సీబీఎస్‌ఏ అధికారులు మాట్లాడుతూ.. దేశ భద్రత, వలస వ్యవస్థ సమగ్రతను కాపాడటంతో పాటు చట్టబద్ధంగా నివసించే పౌరులు, శాశ్వత నివాసితులు, చట్టబద్ధ వలసదారుల హక్కులను రక్షించేందుకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చట్టబద్ధమైన హక్కులు లేకుండా కెనడాలో నివసిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా స్వదేశాలకు పంపిస్తున్నామని స్పష్టం చేశారు.