భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుత 34 నుండి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం!

భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుత 34 నుండి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నలుగురు పెంచేందుకు, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఒక బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.సీజేఐతో సహా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండు ఖాళీలు ఉన్నాయి.

పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించి, చట్టంగా మార్చిన తర్వాత, మంజూరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుతుంది.

2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను చివరిసారిగా 30 నుంచి 33కి (భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) పెంచారు .

సుప్రీం కోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టం 1956, తొలుత రూపొందించబడినప్పుడు, (భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) గరిష్టంగా 10 మంది న్యాయమూర్తులను నియమించాలని నిర్దేశించింది.1960 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ చట్టం ద్వారా ఈ సంఖ్యను 13కి, మరియు అదే చట్టానికి చేసిన మరో సవరణ ద్వారా 17కి పెంచారు .

1986 నాటి సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ చట్టం, సీజేఐని మినహాయించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 17 నుండి 25కు పెంచింది. తదనంతరం, 2009లో చేసిన మరో సవరణ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 25 నుండి 30కి మరింతగా పెంచారు.

2019లో అసలు చట్టాన్ని మరింత సవరించడం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను (భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి) 33కి పెంచారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(3) సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావడానికి కావలసిన అర్హతలను పేర్కొంటుంది..
కనీసం ఐదు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన భారత పౌరుడిని లేదా ప్రముఖ న్యాయకోవిదుడిని సుప్రీంకోర్టుకు నియమించవచ్చు.

కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసిన లేఖ ద్వారా సీజేఐ చేసిన సిఫార్సు మేరకు సుప్రీంకోర్టు బలాన్ని పెంచుతారు. ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత, న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం ఒక ముసాయిదా బిల్లును క్యాబినెట్‌కు సమర్పిస్తుంది.