చలో హైదరాబాద్ ఉద్రిక్తం
Hyderabad is tense.–
ఆరోగ్యశాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశా వర్కర్ల యత్నం
– అరెస్టు చేసిన పోలీసులు..
– లాగి వ్యాన్లలో పడేసిన వైనం
– నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు : అరెస్టైన వారిని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం వివిధ జిల్లాల నుంచి ఆశా వర్కర్లు వేలాదిగా కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి ఆశాలను అడ్డగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. డీఎంహెచ్ఎస్ ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, హైదరాబాద్ సౌత్ అధ్యక్షులు మీనా, నాయకులు హేమలత, గంగామణి, సావిత్రి, మేడ్చల్ జిల్లా నాయకులు రుక్మిన్, నిజామాబాద్ జిల్లా నాయకులు నూర్జహాన్, సీఐటీయూ హైదరాబాద్ జిల్లా నాయకులు మహేందర్తోపాటు వందలాది మంది బైటాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి ఓయూ, కాచిగూడ, నారాయణగూడ, సుల్తాన్ బజార్, అంబర్పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదే సమయంలో వందలాది మంది ఆశా వర్కర్లు ఉమెన్స్ కళాశాల చౌరస్తా నడిరోడ్డుపై బైటాయించారు. పోలీసులతో వాగ్వివాదం అనంతరం వారిని కూడా వ్యాన్లలోకి ఎత్తిపడేశారు. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. అక్రమ అరెస్టులను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ల ముందు ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తోపులాటలో జయమ్మ అనే ఆశా వర్కర్ స్పృహ కోల్పోయింది. అంతకుముందు ధర్నాలో పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరారు. ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు, ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పి.గంగామణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి, వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున ఆశాలు తరలివచ్చారు.
అరెస్టులపై నిరసన కార్యక్రమాలకు పిలుపు
ఆశాల పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం, అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిలుపునిచ్చారు.
అరెస్టులను ఖండిస్తున్నాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేయడం, అమానుషంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. వెంటనే ఆశా వర్కర్లతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన ఆశావర్కర్లను ఓయూ, అంబర్పేట పోలీస్స్టేషన్లలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఆశయ్య, రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు, కె.రమేష్, కోట రమేష్ తదితర రాష్ట్ర నాయకులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే మరింత ఉధృతంగా ముందుకొస్తుందని హెచ్చరించారు. ఆశాలకు అంతకంతకూ పని భారం పెరుగుతున్నది కానీ వేతనం రూ. 9700 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా వచ్చిన ఆశాలతో మాట్లాడి, ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించకుండా, మహిళలని చూడకుండా బట్టలు చినిగి పోయేటట్టు లాగేసి, వ్యాన్లల్లో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. మహిళలను నడి రోడ్డుమీద ఈడ్చి, ఈ విధంగా అవమానించినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన మహిళలందరినీ బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం చర్చించి సమస్యలు పరిష్కరించకపోతే సీపీఐ(ఎం) ఆందోళనకు పూనుకుంటుందని హెచ్చరించారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వడంతో పాటు బీమాసౌకర్యం కల్పించాలనీ, ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్కు బయలుదేరిన ఆశావర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఖండించారు. ఇండ్లలో నిద్రిస్తున్న ఆశాలను మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి, తెల్లవారుఝామున బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని తప్పుబట్టారు. దుశ్చర్యలన్నింటినీ అధిగమించి కోఠి, హైదరాబాద్కు చేరుకున్న ఆశాలు శాంతియుతంగా ధర్నాకు సిద్ధపడుతుంటే పోలీసులు ఆశాలను బూటుకాళ్ళతో తన్నడం దుర్మార్గమన్నారు. తలకు, చేతులకు, కాళ్ళకు తీవ్ర గాయాలైన వారిని కూడా పట్టించుకోకుండా రోడ్డు పైన ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లో నిర్భంధించడాన్ని తప్పుబట్టారు. హైదరాబాద్లోని అంబర్పేట్, ఉస్మానియా యూనివర్సిటీ, కాచిగూడ, నారాయణగూడ, చంద్రాయణగుట్ట తదితర పోలీస్ స్టేషన్లలో నిర్భంధించిన ఆశాలను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్ పరామర్శించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆశా వర్కర్లను ఉస్మానియా, సీజన్స్ ఆసత్రుల్లో పరామర్శించి ఓదార్చారు.