కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది..కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు !.

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కెనడాలోని ఆల్బెర్టా ప్రావిన్స్‌లో అక్టోబర్ 19న జరగనున్న రిఫరెండం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

ఆల్బెర్టా కెనడాలోనే కొనసాగేందుకు ప్రజలు ఓటు వేయాలని కార్నీ కోరారు..

దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటే.. ఆ ప్రాంతం విభజనతో పాటు భవిష్యత్తులో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు..

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని, పలు దేశాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని కార్నీ పేర్కొన్నారు..

ఆల్బెర్టా వనరులపై గత ప్రభుత్వ నిర్ణయాలు స్థానికుల్లో అసంతృప్తి కలిగించిన మాట వాస్తవమేనని మార్క్ కార్నీ అంగీకరించారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామన్న ట్రంప్ బెదిరింపులకు కార్నీ కౌంటర్‌ ఇచ్చారు. ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికే పసిఫిక్ లింక్ పైప్‌లైన్ ప్రాజెక్టును తెస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు రావడంతో పాటు, చమురు ఎగుమతుల కోసం అమెరికాపై ఆధారపడే అవసరం తప్పుతుందని వివరించారు. కెనడా అనుకూల వాలంటీర్లను ఉద్దేశించి మార్క్ కార్నీ మాట్లాడారు. సోమవారం నాటికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని వాలంటీర్లను కోరారు.

“ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇంతకంటే చెత్త సమయం మరొకటి ఉండదు. మన సరిహద్దులకు అవతల ఉన్నవారు మనల్ని విచ్ఛిన్నం చేసి, గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన, విభజన పూరిత వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో మనమంతా ఏకమై ఉండి, ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి..
అల్బెర్టా, కెనడా మధ్య బలమైన బంధం ఉంది’
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి అల్బెర్టాలో స్థిరపడిన వారిని, అలాగే అల్బెర్టా అడవుల్లో కార్చిచ్చుల సమయంలో దేశం నలుమూలల నుంచి వచ్చి సహాయం చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఉదాహరిస్తూ, ఇరు ప్రాంతాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఆయన గుర్తుచేశారు. వాస్తవానికి అల్బెర్టా ప్రాంతం ఒట్టావాలోని లిబరల్ ప్రభుత్వాల విధానాలను, ముఖ్యంగా ఇంధన, ఫెడరల్ అధికారాల విషయంలో విభేదిస్తూ వస్తోంది. కానీ, మార్క్ కార్నీ మాత్రం మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో సంబంధించిన కొన్ని విధానానలు పక్కనపెట్టారు. భిన్నంగా పసిఫిక్ తీరానికి కొత్త చమురు పైప్‌లైన్‌ను వేగవంతం చేశారు. కెనడాను ఒక ఇంధన సూపర్ పవర్గా అభివర్ణించారు. దేశాన్ని బలోపేతం చేయడానికి, అల్బెర్టాను కెనడాలోనే ఉంచడానికి మార్క్ కార్నీ గురువారం ‘బీఎంవో సెంటర్’లో జరిగే ‘ఫరెవర్ కెనడియన్’ ర్యాలీలో పాల్గొనున్నారు. శుక్రవారం ఎడ్మంటన్‌లో మరో ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు, అల్బెర్టా ప్రీమియర్ డానియెల్ స్మిత్ ఈ ఓటింగ్‌కు పిలుపునిచ్చినప్పటికీ, ఆమె కెనడాలోనే కొనసాగడానికి మద్దతుగా బుధవారం తన ఓటును వేశారు. అల్బెర్టా కెనడాలోనే ఉండాలనే దానికే తాను ఓటు వేశానని తెలిపారు.

అమెరికా, కెనడా మధ్య గత కొద్దిరోజులుగా ట్రేడ్ వార్ నడుస్తోంది. ఈ విషయంపై కూడా మార్క్ కార్నీ మాట్లాడారు. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, సుంకాల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి, కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తామనే బెదిరింపుల నేపథ్యంలో కెనడా ఆర్థికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే, భవిష్యత్తులో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కాగా, కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని పలు సందర్భాల్లో ట్రంప్ బెదిరింపులకు పాల్పడగా, ఆ వ్యాఖ్యలకు గతంలోనే కార్నీ కౌంటర్ ఇచ్చారు..