సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముగిసిన నాగరాజు కస్టడీ… సీఐ నాగరాజును 7 రోజులు ప్రశ్నించిన సిట్‌..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముగిసిన నాగరాజు కస్టడీ.

సీఐ నాగరాజును 7 రోజులు ప్రశ్నించిన సిట్‌..

వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలింపు..

కాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరచనున్న సిట్‌..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజు ఏడు రోజుల సిట్ కస్టడీ బుధవారంతో ముగిసింది. మరోవైపు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్‌కు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది.

గత ఏడు రోజులుగా సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారించారు. అయితే, సాయికృష్ణను ఎందుకంత క్రూరంగా హింసించారు, వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా, మృతదేహం ఏమైంది? అనే కీలక ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, చాలా వరకు విచారణకు సహకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కస్టడీ గడువు ముగియడంతో, వైద్య పరీక్షల అనంతరం నాగరాజును అధికారులు తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదిలా ఉండగా, ఈ కేసులో భాగమైన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, సాంబయ్యతో పాటు కానిస్టేబుల్ బాబూరావును సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు వీరి విచారణ జరగనుంది. ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వీరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ అదృశ్యం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై వీరి నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ దర్యాప్తు కొనసాగించనుంది.