కొందరు కావాలనే కుల రాజకీయాలు చేస్తున్నారు.సీఐ కాపు సామాజికవర్గానికి చెందినవారే.,బాధితుడు కూడా కాపు కులస్తుడే..సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిలో సరికొత్త మైలురాయి నమోదైంది. కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మక ‘జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ‘బంగారు అధ్యాయం’ అని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి ఇది ఒక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా రూ. 405 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగానికి చెందిన బంగారు గనుల వెంచర్ కావడం విశేషం.గనుల పరిశీలన.. స్థానిక మహిళలకు శిక్షణ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఖనిజాలతో కూడిన భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మైనింగ్ ప్రాజెక్టు ప్రాంగణమంతా కలయతిరిగి, ముడి ఖనిజం ప్రాసెసింగ్ నుండి బంగారు బిస్కెట్ల తయారీ వరకు జరిగే పూర్తి ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలలో ఉపయోగించే భారీ వాహనాలను నడపడానికి స్థానిక మహిళలు, యువతకు సిమ్యులేటర్ ఆధారిత వ్యవస్థల ద్వారా శిక్షణ ఇస్తున్న కేంద్రాన్ని కూడా సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ ప్రభాకరన్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ లాల్ చంద్ర మైనింగ్, రిఫైనింగ్ ఆపరేషన్ల గురించి ముఖ్యమంత్రికి వివరాలు అందించారు…అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తొలి ప్లాంట్ యూనిట్ను అధికారికంగా ప్రారంభించిన సీఎం, రెండో యూనిట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంలో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు..కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో ఏడాదికి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తదుపరి దశల్లో ఉత్పత్తిని 900 కిలోలకు పెంచి, భవిష్యత్తులో ఏటా 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టును విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, రాయలసీమలో పారిశ్రామిక వృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగావకాశాల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు రాజకీయ, శాంతిభద్రతల అంశాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ కేసు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసులో కొందరు కావాలనే కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు సీఐ కాపు సామాజికవర్గానికి చెందినవారేనని, బాధితుడు కూడా కాపు కులస్తుడేనని స్పష్టం చేశారు. కానీ, దీనికి కూడా కొందరు రాజకీయ రంగు పులిమి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..