అధికారం మొత్తం ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది

ఖమ్మం జిల్లాకు, కొత్త గూడెం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరిలోని నీటిని ఒడిసిపట్టి మొత్తం సస్యశ్యామలం కావాలి.. ఖమ్మం జిల్లా రూపు రేఖలను మార్చాలనే ప్రయత్నం కేసీఆర్ బలంగా చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు..సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు జల యజ్ఞంలో భాగంగా రాజీవ్ సాగర్‌, ఇందిరా సాగర్ అనే రెండు ప్రాజెక్టులకు రాళ్లు వేసి పోయారు. కానీ చేసింది పెద్దగా ఏం లేదు. కానీ కేసీఆర్ ఎవరో సంబంధం లేని నాయకుల పేర్లు ఎందుకని ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాత్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్టు అని పెట్టి మన జిల్లాకు 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా నాలుగురన్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు.. ఎన్‌ఎస్‌పీల కింద కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు సాగునీరందించే బృహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90 వేల ఎకరాల స్థిరీకరణ 40 వేల ఎకరాలు మొత్తం కలిపి లక్షా 30 వేల ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి ఫలితం అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి అని కేటీఆర్ అన్నారు.

ఒకటి రెండు కాదు దాదాపు 10వేల కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8 వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80 శాతం నిధులు మనం ఇప్పటికే ఖర్చు పెట్టాం. మరి ఈ రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం కాంగ్రెస్‌కే గెలుపు అందించిన తర్వాత వాళ్లు మనకేం ఇచ్చారు.. ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి.. ముగ్గురు మంత్రులున్నారు. పవర్‌ఫుల్ పోర్ట్‌పోలియోల్లో ఉన్నారు.. పవర్‌ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది. ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది.. దయచేసి మీరు ఆలోచించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.