రేవంత్ రెడ్డికి బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు….!

రేవంత్ రెడ్డికి బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు..

కేరళం దివంగత కాంగ్రెస్ నేత ఆర్యాదాన్ ముహమ్మద్ పేరిట బెస్ట్ పబ్లిక్ సర్వెంట్– 2026గా ఎంపికైన రేవంత్ రెడ్డి..

ఈరోజు సాయంత్రం కేరళంలోని నిలంబూర్ ప్రాంతంలో అవార్డు అందుకోనున్న రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేరళకు చెందిన ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందజేస్తున్న ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో పాటు రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేస్తున్న వినూత్న పథకాలు, దూరదృష్టి గల నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ ప్రకటించారు.

ఈ అవార్డు ప్రదానోత్సవం కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్యదాన్ ముహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవార్డును స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేరళ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ స్మారకోపన్యాసం చేయనున్నారు. రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు.

ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ మంత్రి ఏ.పి. అనిల్ కుమార్, ప్రముఖ మేధావి కల్‌పెట్ట నారాయణన్‌లతో కూడిన జ్యూరీ రేవంత్ రెడ్డిని ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కేరళ రాజకీయాల్లో ఆర్యదాన్ ముహమ్మద్ సీనియర్ నేతగా, 8 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. కార్మికులు, ప్రజా సంక్షేమం, లౌకికవాద విలువలకు ఆయన ప్రతీకగా నిలిచారు.