సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం.!

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు ముఖ్యమైన అంశాలపై మంత్రులు చర్చించారు. కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రి శ్రీధర్ బాబు మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయాలను మీడియాకు వివరించారు…ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC లో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ 27 మున్సిపాలిటీలు ఇకపై GHMC పరిధిలోకి వస్తాయి. విలీనం కానున్న మున్సిపాలిటీలు ఇవే. పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయి గూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ, జీగీర్ మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.

రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ డిస్కం ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇది రాష్ట్రంలో మూడవ విద్యుత్ డిస్కం. ఈ కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వస్తాయి. అలాగే 3 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను కేబినేట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్తు విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది…హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగుళూరు లో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం GHMC పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14 వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని.. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది..