సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా పాలనలో భాగంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు…ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి అభిప్రాయాలను సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. గ్రామ సభల వేదికగా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పైసా లబ్ధిని ప్రజలకు వివరించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు…విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని కీలక సూచన చేశారు…