కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదు…సిఎం రేవంత్ రెడ్డి.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని.. తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు…శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తీరుపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదన్నారు. ”మీరు ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పండి కిషన్‌ రెడ్డి గారూ.. నోరు వేసుకొని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టులను కిషన్‌ రెడ్డి అడ్డుకొంటున్నారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్‌ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మేం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తుల్ని అడగడంలేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయి. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బిహార్‌లకే ఇస్తోంది” అని విమర్శించారు.

రాష్ట్రానికి మీరేం సాధించారో చెప్పండి?

”తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రి వర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా?ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులను మీరు రాష్ట్రానికి సాధించారు. తెలంగాణ కోసం కేంద్రాన్ని ఏం అడిగారో చెప్పండి. మీరు ప్రస్తావించినవేంటో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. సైంధవ పాత్ర పోషిస్తున్నారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు తీసుకొని హైదరాబాద్‌కు రావాలి. గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని కోట్ల మందికి ఇచ్చారో చెప్పండి. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పండి. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్రం వందల మందిని బలితీసుకుంది. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా అని కిషన్‌ రెడ్డి అవహేళన చేస్తున్నారు. మేం దిల్లీకి వెళ్లి లిక్కర్‌ దందాలు చేయడంలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్తున్నాం” అన్నారు.

భాషను బలవంతంగా రుద్దొద్దు..

ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దు. మన మాతృభాష తెలుగు పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం అన్ని జీవోలను తెలుగులో కూడా ఇస్తోంది. డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెబుతున్నారు. సీట్లు తగ్గవు అంటున్నారు.. కానీ పెరుగుతాయని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. డీలిమిటేషన్‌ పేరిట దక్షిణాదికి అన్యాయం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని ఆ రాష్ట్రాల సీట్లతోనే అధికారంలోకి రావాలని భాజపా చూస్తోంది. ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ.. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు. సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను మాత్రం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు” అని విరుచుకుపడ్డారు..