కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ లక్ష్యంగా సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు గడ్డం ఇందుప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధిష్ఠానాన్ని, తోటి నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు మహిళ నేతలతో వెళ్లి కామారెడ్డి జిల్లా ఎస్పీకి షబ్బీర్ అలీపై అధికారికంగా ఫిర్యాదు చేశారు…
టీపీసీసీ జనరల్ సెక్రటరి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య అయిన ఇందుప్రియ.. ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురించి షబ్బీర్ అలీ తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే తన మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తన భర్త చంద్రశేఖర్ రెడ్డితో పాటు తాను నిత్యం ప్రజాసేవలోనే ఉన్నానని ఇందుప్రియ అన్నారు. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ అలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని మండిపడ్డారు. బయట దేశాల నుండి సోషల్ మీడియా తనపై అసభ్య పోస్టులు వేయిస్తున్నారని మండిపడ్డారు. చర్ల రాజేష్ అనే సీనియర్ నాయకుడిని తాను బాబాయ్ అని పిలుస్తానని ఇందు ప్రియ అన్నారు. అలాంటిది అతను కూడా తన మీద వచ్చిన ట్రోల్స్ ను అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు…తన గురించి తప్పుడు ప్రచారం చేసేటప్పుడు మీ ఇంట్లో కోడలు, భార్య గుర్తుకు రాలేదా అని అని ఇందు ప్రియ ప్రశ్నించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి సైతం ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. ఇకనైన తీరు మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. మొత్తం ఈ వ్యవహాం.. కామారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో తీవ్ర చర్చను లేవనెత్తింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసిన సమయంలో షబ్బీర్ అలీ వర్గం పని చేయని కారణంగా రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. షబ్బీర్ అలీ కామారెడ్డి బదులుగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. షబ్బీర్ అలీ అనుచరులు మాత్రం కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయని కారణంగా రేవంత్ రెడ్డి ఓటమి చెందారని బహిరంగ సత్యం. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇన్ చార్జిగా వ్యవహరించి ప్రచారం నిర్వహిస్తే.. షబ్బీర్ అలీ అనుచరులు మాత్రం పని చేయకుండా నిరాకరణ చేశారని పేర్కొన్నారు.