కరివేపాకు మొక్క పెరగాలంటే ఇలా చేయాలి..!

ముందుగా, నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను వెంటనే పెద్ద కుండీలో పెట్టకూడదు. మొదట 8 లేదా 10 ఇంచుల చిన్న కుండీలో కనీసం ఆరు నెలల పాటు పెరగనివ్వాలి. మట్టి మిశ్రమంలో 40 శాతం మట్టి, 40 శాతం వర్మి కంపోస్ట్ లేదా పశువుల ఎరువు, మిగిలిన 20 శాతంలో ఇసుక, వేపపిండి, కోకోపీట్ కలిపి వాడుకోవాలి. కరివేపాకు మొక్కకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు 6 నుంచి 8 గంటల ఎండ తగిలితేనే మొక్క ఏపుగా పెరుగుతుంది. బాల్కనీల్లో తక్కువ ఎండ తగిలే చోట ఈ మొక్క సరిగ్గా పెరగదు…మొక్క గుబురుగా రావాలంటే పైన చిన్న చిన్న కొమ్మలను తుంచుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది. అలాగే తెగుళ్ల నివారణకు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం మంచిది. కరివేపాకు మొక్కకు ఇచ్చే ఎరువుల్లో ‘పుల్లటి మజ్జిగ’ అమృతం లాంటిది. మూడు రోజులు పులియబెట్టిన మజ్జిగలో కొంచెం ఇంగువ కలిపి 15 రోజులకు ఒకసారి మొక్కకు ఇస్తే, మట్టిలో మైక్రోబ్స్ పెరిగి మొక్క చాలా గ్రీన్‌గా తయారవుతుంది. సమ్మర్‌లో మొక్కపై మల్చింగ్ చేయడం ద్వారా తేమను కాపాడవచ్చు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్క వద్దన్నా పెరుగుతుంది..