గ్యాస్ సంక్షోభం..రెస్టారెంట్లు బంద్
Cylinder Shortage Over Restaurants Closed..
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మార్చి 10 నుండి తీవ్ర అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా పూర్తిగా నిలిచిపోవడంతో నగరంలోని ఆహార వ్యాపార రంగం సంక్షోభంలో పడింది. నగరవ్యాప్తంగా వేలాది హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఈ గ్యాస్ సరఫరాపైనే ఆధారపడటంతో వంట కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది..పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడింది. నగరంలోని 3 వేల కంటే ఎక్కువ హోటళ్లు మరియు రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ.. పరిస్థితి త్వరగా పరిష్కారం కాకపోతే అనేక వంటశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది..
బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పిసి రావు మీడియాతో మాట్లాడుతూ.. హోటల్ యజమానులు సేవలను నిలిపివేయాలనే ఉద్దేశం లేదని, కానీ ఇంధనం లేకపోవడంతో ఇది అనివార్యమైందని తెలిపారు. మంగళవారం నుంచి హోటళ్లలో గ్యాస్ అందుబాటులో ఉండదు. అందువల్ల ఆహారం, ఇతర రిఫ్రెష్మెంట్లను కూడా అందించలేమని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులు, స్థానిక పార్లమెంటు సభ్యులకు ఇప్పటికే లేఖలు పంపామని, సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు.