దిల్లీ ఎర్రకోట పేలుడు కేసును దర్యాప్తు చేసే కొద్దీ భారీ ఉగ్ర కుట్రలు బయటపడుతున్నాయి. తాజాగా ఆత్మాహుతి బాంబర్ ఉమర్ తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బుర్హాన్ వానీ, జకీర్ మూసాకు వారసుడిగా భావించేవాడని దర్యాప్తులో తేలింది. అతడు 2023 నుంచే ఐఈడీల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అతడు పేలుడు పదార్థాలతో చాలా ప్రయోగాలు చేసేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
మరోవైపు ‘వైట్-కాలర్’ టెర్రర్ మాడ్యూల్లో పాల్గొన్న వైద్యుల తీవ్రవాదం 2019లోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి పనిచేసే హ్యాండ్లర్లు ఉన్నత విద్యావంతులైన నిపుణులను పూర్తిగా డిజిటల్ మార్గాల ద్వారా ఉగ్రవాదులుగా తీర్చిదిద్దారని దర్యాప్తు అధికారులు తెలిపారు. నవంబర్ 10న పేలుడు పదార్థాలతో నిండిన కారును నడిపిన డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ అదీల్ రాథర్, డాక్టర్ ముజాఫర్ రాథర్, డాక్టర్ ఉమర్ టెర్రర్ సెల్ సభ్యులు ఫేస్బుక్, X వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వెంటనే ‘టెలిగ్రామ్’లోని ప్రైవేట్ గ్రూపులకు మార్చి, అసలు బ్రెయిన్వాషింగ్ ఇక్కడి నుంచే ప్రారంభించారని వివరించారు.
దాడులు, ఉగ్ర ప్లాన్ విషయంలో మిగిలిన వారితో అభిప్రాయభేదాలు రావడంతో మరో ఉగ్రవాది ఆదిల్ రాథర్ పెళ్లికి ఉమర్ హాజరుకాకపోయినట్లు గుర్తించారు. కశ్మీర్లో ముఫ్తీ ఇర్ఫాన్ అరెస్టు విషయం తెలియగానే అక్టోబర్ 18న హడావుడిగా ఖాజీగుండకు వెళ్లి మిగిలిన తమ గ్రూప్‌లోని సభ్యులతో భేటీ నిర్వహించి వారిని అప్రమత్తం చేశాడు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని మిగిలిన సభ్యులైన ముజమ్మిల్, ముఫ్తీ ఇర్ఫాన్, ఆదిల్లు అల్‌ఖైదా భావజాలంతో పనిచేస్తుంటే, ఉమర్ మాత్రం ఐసిస్ తరహాలో పని చేయాలని భావించేవాడు. ఈ బృందంలో కొందరు అఫ్గానిస్థాన్‌కు కూడా వెళ్లేందుకు ప్రయత్నించినా విఫలమైంది. ముఖ్యంగా ఈ గ్రూపులో ఉమర్ లెక్కలేకుండా నిధులు ఖర్చుపెట్టడంపై అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఈ నిధుల్లో అత్యధిక భాగం మహిళా సభ్యురాలైన డాక్టర్ షాహీన్ నుంచి లభించాయి..
ఉగ్ర డాక్టర్ల గ్రూపు తమను తాము తాత్కాలిక అన్సార్ ఘజ్వతుల్ హింద్ సంస్థగా చెప్పింది. ఈ బృందానికి డాక్టర్ ఆదిల్‌ను అమీర్ (నాయకుడిగా)గా ఎంచుకొంది. ఇది భారత ఉపఖండంలో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తుంది. పోలీసులు కూడా ఈ ఉగ్రముఠాకు జైషే, అన్సార్ ఘజ్వతుల్ హింద్‌లతో సంబంధాలున్నట్లు ధ్రువీకరించారు. ఈ ముఠాలోని ముజమ్మిల్ రష్యా తయారీ రైఫిల్‌ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం డాక్టర్ షాహీన్ నెట్‌వర్క్‌లోని కాంటాక్ట్‌లను వాడుకొన్నాడు. ఆదిల్‌ను అరెస్టు చేసిన సమయంలో ఆ ఆయుధాన్ని ఓ లాకర్ నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. దీంతో పాటు పేలుడు పదార్థాలను ఉంచడానికి కూడా షాహీన్ సాయంతో ముజమ్మిల్ ఓ డీప్ ఫ్రీజర్ కూడా కొనుగోలు చేశాడు. ఉష్ణోగ్రతకు ప్రభావితం అయ్యే రసాయనాలను దీనిలో భద్రపరిచేవారు. ప్రస్తుతం వీటిని ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. వీటి కొనుగోళ్లకు పుల్వామా దాడి కుట్రదారుడు ఉమర్ ఫరూఖ్ భార్య అఫ్రా బీబీ సాయం తీసుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ మేనల్లుడే ఈ ఫరూఖ్. ఇతడిని 2019లో భద్రతా దళాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి.
ఇక మరో రష్యా తయారీ రైఫిల్, చైనా తయారీ స్టార్ పిస్టోల్, బెరెట్టా పిస్టోల్, 2,900 కిలోల పేలుడు పదార్థాలను అనంతరం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా రసాయనాలను నూహ్ నుంచి, ఎలక్ట్రానిక్ పరికరాలను దిల్లీలోని భాగీరథి ప్లేస్, ఫరీదాబాద్‌లోని ఎన్ఐటీ మార్కెట్ నుంచి సేకరించింది.
పాఠశాల సమీపంలో పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ లభ్యం.
మరోవైపు ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాల సమీపంలో పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు కనిపెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. అల్మోరా జిల్లా దబారా గ్రామంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధానోపాధ్యాయుడు అనుమానాస్పద వస్తువులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబు స్క్వాడ్ సహా భద్రతాధికారులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. సమీప పొదల్లో భారీగా జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించిన బాంబు నిర్వీర్వ దళాలు వాటిని అక్కడి నుంచి తరలించాయి. 20 కిలోల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నామని సీనియర్ సూపరింటెండెంట్ అధికారి దేవేంద్ర పించా వెల్లడించారు. సమీప ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశామని, జిలెటిన్ స్టిక్స్ ఇక్కడ ఎవరు, ఎందుకు పెట్టారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..