సినిమా రంగంలో ఇప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని పసిగట్టి జాగ్రత్తగా ఉంటేనే ఇక్కడ రాణించగలరు సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు..

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పెద్ద సినిమాలను.. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చిన్న చిత్రాలను నిర్మిస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే కెరీర్‌ ప్రారంభంలో చాలా ఇబ్బందులు వచ్చాయని, అవన్నీ తట్టుకొని నిలబడితేనే ఇప్పుడీ స్థానంలో ఉన్నానంటున్నాడు దిల్‌ రాజు. సినిమా రంగంలో ఇప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని పసిగట్టి జాగ్రత్తగా ఉంటేనే ఇక్కడ రాణించగలరి చెబుతున్నాడు.

సినిమా రంగంలోకి రావాలనుకునే నూతన దర్శక నిర్మాతలు, నటీటనులతో పాటు టెక్నీషియన్లకు సరైన గైడెన్స్‌ ఇవ్వడం కోసం ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌ ‘ పేరిట ఆయన ఓ వేదికను ఏర్పాటు చేశాడు. తాజాగా ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌ ‘ వెబ్‌సైట్‌ని విజయ్‌ దేవరకొండ, దేవీశ్రీ ప్రసాద్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేయించారు.

ఈ సందర్భంగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్తవాళ్లకు దిల్‌ రాజు పలు సూచనలు చేశారు. ఇక్కడ 1 శాతమే సక్సెస్‌ ఉంటుందని.. 24 గంటలు కష్టపడితే తప్ప ఆ సక్సెస్‌ రాదని అన్నారు. ఇండస్ట్రీలో జరిగే మోసాల గురించి చెబుతూ.. తన కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ గురించి వివరించాడు.

‘1996లో నేను, శిరీష్‌ సినిమా రంగంలోకి వచ్చాం. ఫస్ట్‌టైం ఓ సినిమా కొందామని హైదరాబాద్‌ వచ్చాం. దర్శకనిర్మాతలతో చర్చించి సినిమా కొన్నాం. సినిమా ఓపెనింగ్‌ రోజు మాకు ఆహ్వానం అందింది. దీంతో నేను, శిరీష్‌ సెట్‌కి వెళ్లగానే.. ‘సర్‌..మీరు చూడడానికి చాలా బాగున్నారు.. ఈ సినిమాలో నటించండి’ అన్నారు. నేను ఓకే చెప్పాను. మరుసటి రోజు షూటింగ్‌కి వెళితే.. అక్కడ నాకు, శిరీష్‌కి బ్యానర్లు కట్టారు. ఎందులో అలా చేశారో అర్ధం కాలేదు. సరే అని లోపలికి వెళితే..అక్కడే కూర్చోబెట్టారు.

మధ్యాహ్నం తర్వాత ఒకరు వచ్చి నాకు మేకప్‌ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకెళ్లి.. ఒక అమ్మాయితో గంట కొట్టించి..మీ షూట్‌ అయిపోంది’ అని చెప్పారు. మేము సినిమా కొంటున్నాం కాబట్టి.. మమ్మల్ని ఆకర్షించడానికి అలా చేశారు. మరుసటి రోజు వెళ్లి.. ఇలాంటి యాక్టింగులు ఆపండి. సినిమాలు కొన్నాం కదా.. ఫస్ట్‌ అది కంప్లీట్‌ చేయండి’ అని చెప్పి వచ్చాం. ఆ తర్వాత నేను, శిరీష్‌, లక్ష్మణ్‌ చర్చించుకొని.. ఆ సినిమాను వదిలేసుకున్నాం. అడ్వాన్స్‌గా డబ్బులు వదిలేసి.. మరో సినిమాపై దృష్టి పెట్టాం. ఇలాంటి మోసాలు జరుగుతాయి. రూ. రెండు కోట్ల బడ్జెట్‌తో సినిమా పూర్తవుతుందని నమ్మించి.. చివరకు నాలుగు కోట్ల వరకు తీసుకొస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

సినిమా ఇండస్ట్రీలో మనం రాణించగలుగుతామా లేదా అనేది మనకే తెలియాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. సినిమా అనేది ఒక అట్రాక్షన్. అది లాగుతుంటుంది. జీవితాలు మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎప్పుడైతే మీరు సినిమాలో సక్సెస్ అవుతున్నారని మీకు అర్థం అవుతుందో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.