మరోసారి భారీ ఉగ్రదాడి ….16 మంది సైనికులు మృతి..!

పాకిస్థాన్‌లో మరోసారి భారీ ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజిరిస్థాన్ జిల్లాలో సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కనీసం 16 మంది సైనికులు చనిపోగా.. ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో చిన్నారులు సహా సాధారణ పౌరులు కూడా ఉన్నారు. స్థానిక ప్రభుత్వ అధికారి.. ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఓ ఫిదాయి సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు’ అని చెప్పారు. ఈ దాడితో సమీపంలో ఉన్న రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్ తాలిబన్ అనుబంధం సంస్థ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపు ప్రకటన చేసింది. తాలిబాన్‌ మద్దతుదారుల ఆత్మాహుతి విభాగంగా దీనిని పరిగణిస్తారు. ఆఫ్ఘన్ సరిహద్దులో పెరుగుతున్న ఉగ్రవాదంతో పాకిస్థాన్‌కు ఉక్కిరిబిక్కిరవుతోంది. అఫ్ఘనిస్థాన్‌లో 2021 ఆగస్టులో తాలిబాన్ల మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు గణనీయంగా పెరిగాయి. అయితే, తమ దేశంలో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు తాలిబన్ పాలనలోని అఫ్గన్ ఆశ్రయం కల్పిస్తోందని దాయాది ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను తాలిబాన్ ఖండిస్తోంది. పాక్ సైన్యంపై బలూచీస్థాన్ లిబరేషన్ ఆర్మీ మెరుపుదాడులు చేస్తోన్న విషయం తెలిసిందే.

2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఖైబర్ పక్తూన్‌ఖ్వా, బలూచిస్థాన్‌ ప్రావిన్సులో జరిగిన వేర్వేరు ఉగ్రదాడుల్లో సుమారు 290 మంది మరణించారు.. వీరిలో ఎక్కువ మంది సైనికులే కావడం గమనార్హం. బలూచిస్థాన్‌లో వేర్పాటువాదం పాకిస్థాన్‌కు కంట్లో నలుసుగా మారింది. తరుచూ సైనికులే లక్ష్యంగా బలోచి లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడులకు దిగుతోంది.ఈ ఏడాది మార్చిలో ఏకంగా సైనికులు, వారి కుటుంబాలు ప్రయాణిస్తోన్న రైలును బీఎల్ఏ హైజాక్ చేయడం గమనార్హం. పాక్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. బలోచ్ ప్రజలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారు.

కాగా, తాజాగా జరిగిన ఉగ్ర దాడి పాక్ భద్రతా వ్యవస్థ బలహీనతను మరోసారి బయటపెట్టింది. పాక్ తాలిబన్ గ్రూప్ దాడులతో పాకిస్థాన్ ఆర్మీ నిరంతరం భయాందోళనలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక, సరిహద్దు భద్రతా లోపాలు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు దక్షిణాసియాలో శాంతికి గణనీయమైన ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.