ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలు పెట్టిన ఆశావహులు

ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నానని తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

ఈ విషయం తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి తనకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

కాంగ్రెస్ నాయకుల మధ్య మరోసారి అంతర్గత పోరుకు దారి తీస్తున్న మంత్రి వర్గ విస్తరణ..

తెలంగాణలో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల వేట మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళనపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించబోతోందన్న వార్తలతో ఆశావహులు హస్తిన బాట పట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండటం, క్యాబినెట్‌లో మూడు ఖాళీలు ఉండటంతో.. ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు, పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్‌ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాల రీత్యా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు. మూడు తరాలుగా తాము కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని ఉన్నామని, బీఆర్‌ఎస్‌ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కాంగ్రెస్‌ను వీడలేదని, తన నిబద్ధత, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలో విన్నవించిన ఆయన.. మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హస్తిన బాట పట్టారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఆశావహులు కొంతకాలంగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు లాబీయింగ్‌ మొదలుపెట్టారు. గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ.. అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే, ఈసారి క్యాబినెట్‌ విస్తరణలో సామాజిక సమతుల్యతతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలకు పెద్దపీట వేయాలని హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి?, ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది?, ఎవరి పదవులకు ఎసరు వస్తుంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..