ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. సర్వీస్‌లో ఉన్నప్పుడు చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ఈపీఎఫ్ఓ భారీగా పెంచింది. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటి? డెత్ రిలీఫ్ ఫండ్‌ను ఎంత పెంచింది? అందుకు అర్హతలేంటి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డెత్ రిలీఫ్ ఫండ్ రూ.15 లక్షల పెంపు
ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులకు బంగారు నిధిలాంటిది. కష్టసమయాల్లో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. దీనిని ఈపీఎఫ్ఓ నడుపుతుంది. పీఎఫ్ కు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తుంటుంది. తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు, వారి కుటుంబ సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్‌ను భారీగా పెంచింది.
గతంలో ఉన్న రూ. 8.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి నుంచి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త నిబంధన 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్పం చేసింది. అంటే ఎవరైనా ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 8.8 లక్షలకు బదులుగా రూ. 15 లక్షలు వస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి ఈ మార్పుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఆగస్టు 19న సర్క్యులర్ జారీ చేసింది.
ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో ఏముందంటే?
“డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని రూ.8.80 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్/ ప్రెసిడెంట్, సెంట్రల్ స్టాఫ్ వెల్ఫేర్ కమిటీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమోదం లభించింది. సెంట్రల్ బోర్డ్ లో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు (నామినీ లేదా చట్టపరమైన వారసులు) సిబ్బంది సంక్షేమ నిధి నుంచి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను చెల్లించాలి” అని ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో పేర్కొంది..