కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న జీ7 సదస్సుకు (G7 Summit) భారత్‌కు ఇంకా ఆహ్వానం అందలేదు. దీంతో ఆరేళ్లలో తొలిసారి ఈ సదస్సుకు ప్రధాని మోదీ (Narendra Modi) దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది..ఈ పరిణామంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికాను అనుమతించిన తర్వాత ఇది మరో దౌత్యపరమైన భంగపాటేనని పేర్కొంది.
కెనడాలో జరగనున్న జీ7 సదస్సులో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఇంకా ఆహ్వానం పంపలేదని తెలిసింది. ఒకవేళ ఆహ్వానం వచ్చినా.. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడికి వెళ్లకపోవచ్చనే వాదన ఉంది. దీంతో జీ7లో ప్రధాని మోదీ పాల్గొనకపోవడం ఆరేళ్లలో తొలిసారి అవుతుంది.
పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌పై విషం చిమ్మారు – సీడీఎస్ అనిల్ చౌహాన్
ఇదే అంశంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడాతోపాటు జర్మనీ అధినేతలు జీ7 సదస్సులో పాల్గొననున్నారని, వీరితోపాటు బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడించారు. 2014కు ముందుకు జీ8గా ఉండేదని, నాటి ప్రధాని మన్మోహన్‌కు అప్పట్లో ఆహ్వానం వచ్చేదన్నారు. 2014 తర్వాత ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ.. ఆరేళ్లలో తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందలేదన్నారు. ఎలా చూసినా.. దౌత్యపరంగా ఇదో భంగపాటేనన్నారు.
ఇదిలాఉంటే, జీ7 దేశాల్లో భారత్ లేకున్నప్పటికీ.. నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు మన ప్రధాని ఆ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొంటున్నారు. గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్‌తోపాటు ఆఫ్రికా, దక్షిణఅమెరికా, పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొని తన గళాన్ని వినిపించారు..