జెన్ జీ’లపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన కామెంట్లపై నటుడు సోనూసూద్ స్పందించారు. ‘జనరేషన్ గట్టర్’ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదని సోనూసూద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆమె ఏం మాట్లాడిందో నేను వినలేదు. యువత వల్లే నటులకి గుర్తింపు వస్తుంది. వారే మనల్ని ఈ ఉన్నత స్థానానికి చేరుస్తారు. జనాలు మనకు మద్దతుగా నిలిచినంత కాలమే మనం ఇక్కడ రాణించగలం. వారు లేకపోతే మన మనుగడ కష్టం’ అని అన్నారు. కంగనా రనౌత్ జెన్ జీలను ‘గట్టర్’ అని సంబోధించిన విషయాన్ని రిపోర్టర్లు గుర్తు చేయగా..
‘కంగనా నిజంగానే అలా అని ఉంటే.. ఆమె వ్యాఖ్యలు చాలా అవమానకరం. కంగనా అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు దేవుడితో సమానం. మీ వృత్తి ఏదైనా కావచ్చు.. ప్రజలు మీతో కనెక్ట్ అయి ఉన్నంత వరకే ఈ ప్రపంచంలో మీ ఉనికికి విలువ ఉంటుంది’ అని హితవు పలికారు.