ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం
Local Body Elections,
28 మంది IASలను పరిశీలకులుగా నియమించిన SEC
నిష్పక్షపాతం, పారదర్శకంగా ఎన్నికలు జరగాలి
ఎన్నికల కోడ్ అమలుపై నిరంతర పర్యవేక్షణ చేయాలి
-ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా
రాజకీయ ప్రతినిధులు కోడ్ ఉల్లంఘించకుండా చూడాలి
నిబంధనల ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకోవాలి
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి
జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలి
ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావులేకుండా చర్యలు-SEC
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సాధారణ పరిశీలకులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలకులకు ఆయన పలు సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుసరించే విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాటించాలని, రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోల్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించిందని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్ల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల నిర్వహణ విధానాలు తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశీలకులకు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు
ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఓటు హక్కును వినియోగించుకునే సామాన్య పౌరుల వరకు అందరికీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని పేర్కొన్న కమిషనర్, ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనలో జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు తగిన మార్గదర్శకత్వం అందించడం, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం సాధారణ పరిశీలకుల బాధ్యత అని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.