తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
రాయలసీమలో సాధారణంకంటే 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు..
డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీలు నమోదు
తెలంగాణ పటాన్ చెరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..
హైదరాబాద్లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాగల ఐదు రోజులు మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు..
చలి వణికిస్తోంది.. ఎముకలు కొరికే చలితో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలిని తట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖసైతం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు చలి తీవ్రత నుంచి జాగ్రత్తలు పాటించాలని సూచించింది..తెలంగాణ ప్రజలను చలి వణికిస్తోంది. ఉదయం, రాత్రి వేళ్లలో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పొద్దుపోయే సమయం నుంచి ఉదయం 10గంటల వరకు చలి ఇరగబడుతోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల దిగువన నమోదయ్యాయి. సంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఏకంగా 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 19 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది…
ఈశాన్య భారతం నుంచి వస్తున్న గాలులతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని.. వచ్చే మూడ్రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.