చిరంజీవి అన్నింటినీ తొక్కేశాడు.. హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ కమెడియన్, నటుడు హైపర్ ఆది ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి సాధించిన స్థాయిని కొనియాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో NO.1గా ఎవరూ ఎక్కువకాలం కొనసాగలేరనే అహంకారాన్ని చిరంజీవి తొక్కేశారని, ఏకంగా మూడు దశాబ్దాల పాటు అగ్రస్థానంలో నిలిచారని హైపర్ ఆది అన్నారు.
అలాగే భారీ కలెక్షన్లు కేవలం బాలీవుడ్లోనే సాధ్యమవుతాయనే అభిప్రాయాలను కూడా చిరంజీవి చెరిపేశారని పేర్కొన్నారు. డ్యాన్స్ అంటే కేవలం నడవడం, హీరోయిన్ చుట్టూ తిరగడం కాదని తన స్టెప్పులతో నిరూపించారని అన్నారు.
హీరోలు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే ఉంటారనే ఆలోచనను కూడా చిరంజీవి మార్చేశారని హైపర్ ఆది వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తండ్రి విజయవంతమైతే కొడుకు అదే స్థాయికి చేరుకోలేడనే అభిప్రాయాలను సైతం చిరంజీవి తప్పని నిరూపించారని అన్నారు. తన కుమారుడు రామ్ చరణ్ను తనకంటే గొప్ప స్థాయికి తీసుకెళ్లిన తండ్రిగా చిరంజీవి నిలిచారని హైపర్ ఆది ప్రశంసించారు.
“అవును.. చిరంజీవి తొక్కేశాడు!” అంటూ హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.