దేవాదుల ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు నడవటం లేదు.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
దేవాదుల ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు నడవటం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్‌హౌస్‌ను హరీశ్‌రావు సందర్శించారు. వరంగల్ జిల్లాలో దేవాదుల పరిధి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిచాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచినట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టాం..
దేవాదుల ఆయకట్టును 47 వేల ఎకరాల నుంచి 3.17 లక్షల ఎకరాలకు పెంచామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మోటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నడపలేకపోతోందని విమర్శించారు. నిర్వహణ ఖర్చులు రూ.8కోట్లు లేక మోటర్లు నడపటం లేదన్నారు. గండిరామారంతోపాటు ఇతర లిఫ్ట్‌లు బంద్ చేశారని మండిపడ్డారు. దేవన్నపేట పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు నడవటం లేదని తెలిపారు. మరమ్మతులకు గురైనట్లు అధికారులు చెబుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.7,300 కోట్ల మేర దేవాదులపై ఖర్చు పెట్టామని వివరించారు. 80 శాతానికి పైగా పనులు పూర్తి చేశామన్నారు. 47 వేల ఎకరాల ఆయకట్టును 3.17 లక్షల ఎకరాలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.
30వేల ఎకరాల భూ సేకరణ..
దేవాదుల ప్రాజెక్టు కోసం 33 వేల ఎకరాలు అవసరం ఉండగా, 30 వేల ఎకరాల భూ సేకరణ బీఆర్ఎస్ ప్రభుతం హయాంలో పూర్తయిందన్నారు. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిగతా 3 వేల ఎకరాల భూ సేకరణ చేస్తే అదనంగా 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో దేవాదుల ప్రాజెక్టు కోసం కనీసం రూ.200 కోట్లు అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టుపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు.