రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు..

నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్‌డీలర్లకు.. కాంగ్రెస్, బిజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అని పేర్కొన్నారు..రేషన్‌ బియ్యం పంపిణీకి సంబంధించిన కమిషన్‌ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమిషన్ పెంపు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. ఎన్నికల ముందు అబద్దపు హామీలతో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారు. మాటలు తప్ప చేతలులేని కోతల ప్రభుత్వం ఇది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో (08.08.2023) సచివాలయానికి రేషన్ డీలర్లను ఆహ్వానించి వారి సమస్యలను విని పరిష్కరించాం. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమిష‌న్‌ను రూ. 900 నుంచి రూ. 1400లకు పెంచినం. ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడుతున్నా రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200లుగా ఉన్న కమిష‌న్‌ను రూ. 1400లకు పెంచామ‌ని పేర్కొన్నారు.

17 వేలకు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపినం. కమిషన్ చెల్లించడమే కాదు, కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేసినం. రేషన్ డీలర్‌షిప్ వయో పరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచినం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీని సైతం అమలు చేయకుండా రేషన్ డీలర్ల పాలిట శకునిలా వ్యవహరిస్తున్నది. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్ కమిషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ. 5 వేల గౌరవ వేతనం, కమిషన్ పెంపు ప్రకటించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు..